Geetha Koumudi-1    Chapters   

రెండవ కిరణము

గీతావిశిష్టత-గీతయే ప్రపంచ మత గ్రంథము

ప్రపంచములో హిందూమతము, క్రిష్టియనుమతము, ముసల్‌మాను మతము అను 3 మతములు ప్రధానముగా ఉన్నవి, హిందూమతము అనగా వేదమతము. ఈ మతము నకు మతగ్రంథము వేదసారమైన భగవద్గీత, క్రిష్టియన్‌ మతమునకు బైబిల్‌, ముసల్‌మాను మతమునకు ఖురాన్‌ మత గ్రంథములై ఉన్నవి. ఈ మూడింటిలో ప్రపంచమంతకును మతగ్రంథముగా చెప్పతగినది ఏది? అను విషయమును పరిశీలించుదము.

క్రిష్టియను మతము క్రీస్తుతో యిప్పటికి సుమారు 2 వేలు సం||రముల క్రిందట ప్రారంభము అయినది.

మహమ్మద్‌ మతము యిప్పటికి సుమారు 1400 సం|| రముల క్రిందట మహమ్మదుతో ప్రారంభ##మైనది. ప్రపంచము పుట్టి యిప్పటికి మన భారతీయ వైదిక పంచాంగము ప్రకారము 195 58 85 066 సం||రములు అయినది; అనగా1951/2 కోట్ల సం||రములకు పైగా అయినది పాశ్చాత్యపదార్థ విజ్ఞానశాస్త్రవేత్తలున్ను, భూగర్భ శాస్త్రపరిశోధకులున్ను అయిన మహామహులు కూడా యీ సృష్టి పుట్టియిప్పటికి సుమారు 200 కోట్ల సం||రములు అయినదని నుడివి యున్నారు. ఆ ప్రకారము ఈసృష్టి పుట్టి సుమారు 1951/2 కోట్ల సం||రములు పైగా అయినపుడు యిప్పటికి సుమారు 2 వేల సం||రముల క్రిందట పుట్టిన క్రిష్టియను మతగ్రంథముగాని, సుమారు 1400 సం||రముల క్రిందట పుట్టిన మహమ్మదీయ మతగ్రంథముగాని సృష్టికి అంతకు మత గ్రంథములు కానేరవు. అవి సృష్టికి అంతకు మతగ్రంథములు అయినచో ఆ రెండు గ్రంథములు పుట్టక పూర్వమే కొన్ని కోట్ల సం||రముల క్రిందట సృష్టి పుట్టుటచేత అట్టి సృష్టిలోని ప్రజలందరకు మతమే లేకపోవలెను. భగవంతుడు మతమును మతగ్రంథమును ప్రజలకు అనుగ్రహించకుండా ప్రజలను సృష్టించుట అసంభావ్యము. కనుక బైబిలున్ను, ఖురాన్‌ యున్నూ అవి పుట్టకముందు ఉన్నవారని తరింపజేయలేవు గనుక అవి సృష్టికంతకును మతగ్రంథములగుటకు వీలు లేదు. ఇకను హిందూమత గ్రంథమైన వేదసారమగు భగవద్గీతను గురించి విచారించుదము. భగవద్గీతను కృష్ణపరమాత్మ అర్జునునకు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభములో బోధించినట్లు అందరికి తెలిసిన విషయమే. కురుక్షేత్ర యుద్ధము జరిగి యిప్పటికి సుమారు అయిదువేల సం||రములకు పైగా అయినది. అట్లు అయినచో సుమారు 5000 సం||.రముల క్రిందట పుట్టిన భగవద్గీత 1951/2 కోట్ల సం||రముల క్రిందట పుట్టిన సృష్టికి అంతకి మతగ్రంథము ఎట్లు కాగలదు ? అను ఆక్షేపణ బైబిల్‌, ఖురాన్‌ కు వచ్చినట్లుగానే గీతా విషయములో కూడా వచ్చును దీనికి జవాబు ఏమనగా - భగవద్గీత కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమున అర్జునునకు శ్రీకృష్ణుని చేత ఉపదేశింపబడినట్లు కనబడినప్పటికి, గీతాబోధయొక్క ఆవిర్భావమునకు అదే ప్రారంభము కాదు. గీత 4 వ అధ్యాయము ప్రథమ శ్లోకములో గీతా సందేశమును సృష్ట్యాదిని కృష్ణపరమాత్మ సూర్యునకు అనుగ్రహించినట్లు స్పష్టమగుచున్నది. సృష్టి పుట్టిన తరువాత యిప్పటికి సుమారు 5200 సంవత్సరములకు పూర్వము అవతరించిన కృష్ణుడు సృష్ట్యాదిని అనగా యిప్పటికి సుమారు 1951/2 కోట్ల సం||రముల పూర్వము సూర్యునికి ఎట్లు ఉపదేశింపగలడు? సృష్టి చేసిన భగవంతుడే సృష్ట్యాదిలో అట్టి ఉపదేశమును చేయుటకు సాధ్యము; అంతేకాని యితరులకు సాధ్యము కానేరదు. కనుక సృష్ట్యాదిని సూర్యునకు ఉపదేశించినది సాక్షాత్తు భగవంతుడే అయి యుండవలయును. అట్టి ఉపదేశమును కృష్ణుడు తాను చేసినానని చెప్పుటచే, అర్జునునకు బోధచేసిన కృష్ణుడు దేవకీవసుదేవులకు సుమారు 5200 సం||రం క్రిందట పుట్టిన విగ్రహరూపుడు మాత్రమే కాదని తేలుచున్నది. ఆ కృష్ణుడు భగవంతునియొక్క అవతారము. అట్టి అవతారమైన కృష్ణుడు తన తాత్కాలిక మైన అవతార రూపములో గాక వాస్తవమైన భగవత్‌ స్వరూపుడుగానే అర్జునునకు గీతను బోధించెను. అందుకనే అర్జునునకు కృష్ణుడు గీతను బోధించినను, గీతకు 'కృష్ణగీత' అని కృష్ణనామముతో పేరురాక, సాక్షాత్తు భగవంతుడే బోధ చేయుటచేత, 'భగవద్గీత' అను నామము వచ్చినది. రాముడు చెప్పినగీత 'రామగీత' అనియు, రుద్రుడు చెప్పిన గీత 'రుద్రగీత' అనియు, గణపతి చెప్పిన గీత 'గణశగీత' అనియు, శ్రుతులు చెప్పిన గీత 'శ్రుతిగీత' అనియు, గోపికలు చెప్పిన గీత 'గోపికగీత' అనియు యిట్లు బోధ చేసిన వారినామములతో ఆయాగీతలు విరాజిల్లుచుండగా, కృష్ణుడు చెప్పిన గీతకు 'కృష్ణగీత' అను పేరురాక 'భగవద్గీత' అను పేరువచ్చుటకు కారణము యిదియే. అందుకే గీతలో మధ్య మధ్యను 'భగవానువాచ' అను యున్నదిగాని 'కృష్ణోవాచ అని లేదు. ఇంకను భగవద్గీతలోని శ్లోకములను పట్టి చూచినను సృష్టికర్త అయిన భగవంతుడే సాక్షాత్తుగీతను బోధించి యుండవలెను. గాని సుమారు 5200సం||రముల క్రిందట అవతరించిన కృష్ణుడు మాత్రం బోధించియుండదనిస్పష్టము. గీతలోని 'మాయాధక్షేణప్రకృతి స్సూయతే స చరాచరం' అను శ్లోకము నా అధ్యక్షత క్రింద ప్రకృతి సృష్టి నంతటను చేసినది, అనుభావమును స్పష్టము చేయునపుడు అధ్యక్షుడనైన నేను అను శబ్దమునకు అర్థము సాక్షాత్తు భగవంతుడే అని స్పష్టమగుచున్నదిగదా. ఇంకను గీతలో 'అజః అవ్యయః అనగా పుట్టుకలేనివాడు నాశనము లేనివాడు అనుమున్నగు యిటువంటి నిదర్శనములు చాలా గలవు. కనుక గీతను సృష్టికర్త అగు సాక్షాత్తు భగవంతుడే సృష్టిలోని ప్రజలందరకు మతగ్రంథముగా అనుగ్రహించినాడని తేలుచున్నది.

ఇంకను క్రిష్టియన్‌ మతముయొక్క ప్రవక్తయైన జీసస్‌ క్రీస్తుయును, మహమ్మదీయు మతముయొక్క ప్రవక్తయైనమహమ్మదుయును, భగవంతునియొక్క కుమారులుగనో, దూతలుగనో వర్ణింపబడినారుగాని, సాక్షాత్తు భగవంతుడుగా వర్ణింపబడి యుండలేదు. గాని మన భగవద్గీతను సాక్షాత్తు భగవంతుడే చెప్పియున్నాడు. ఈ కారణముచేత కూడా భగవద్గీతయే ప్రపంచ మతగ్రంథము కాదగియున్నది. ఇంకను గీత 4వ అధ్యాయము 11 వ శ్లోకములో 'మానుష్యాః' అనిన్నీ, 3 వ అధ్యాయము 17 వ శ్లోకములో 'మానవః' అనిన్నీ, 9 వ అధ్యాయము 22 వ శ్లోకములో 'జనాః' అనిన్నీ శబ్దముల ప్రయోగములవల్ల కూడా గీత ప్రపంచము లోని మానవుల అందరికిని సంబంధించి అందరిని తరింప చేయుటకు గాను అవతరించిన మత గ్రంథము అని తేలుచున్నది.

మరియు ఆయా మతగ్రంథముల బోధలను పరిశీలించినను భగవద్గీతయే ప్రపంచ మతగ్రంథము కాతగినదని స్పష్టపడుచున్నది. మానవుని మనస్సుకు 3 రకముల ప్రవృత్తులు కలవు. అవి ఏవి అనగా- (1) వాంఛించుట (2) అనుభవించుట (3) తెలిసికొనుట. ఈ మూటిలో 'వాంఛించుట' అను మనఃప్రవృత్తి వాంఛారూపములోనే పర్యవసానము కానేరదు. వాంఛ తీరవలెనన్న ఏదో తగిన ప్రక్రియ జరుగవలెను. మామిడిపండును తినవలెనని కోరిక కలిగినచో, ఆ కోరిక నెరవేరుటకు ఆపండు కొనుట, తినుట, అను కర్మ జరుగవలయును. అపుడు కాని ఆ కోరిక పూర్తి కానేరదు. కనుక వాంఛ అను మనఃప్రవృత్తి కర్మలోనే పర్యవసానమగును. వాంఛ అనునది ప్రపంచవిషయములకు సంబంధించినది అయినచో ప్రపంచవిషయములు పరిచ్ఛిన్నములు, అనిత్యములు, దుఃఖప్రదములు అగుటచేత వాంఛయను మనః ప్రవృత్తి పరిపూర్ణముగ సఫలము కానేరదు. అది పరిపూర్ణము సఫలము కావలెనన్న అపరిచ్ఛిన్నమై నిత్యమైన భగవంతునికి సంబంధించి యుండవలయును. భగవంతుడు సర్వవ్యాపకుడును, సచ్చిదానంద స్వరూపుడును అగుటచేత, వాంఛ భగవంతునికి సంబంధించినది. అయినచో భగవంతునకు సంబంధించిన కర్మలోనే పర్యవసానమై, పరిపూర్ణము ఆనందదాయకము అగును. ఇదియే భగవంతునకు సంబంధించిన కర్మయోగము. అటులనే రెండవ మనఃప్రవృత్తియైన 'అనుభవించుట' అనునది కూడ ప్రపంచ విషయములకు సంబంధించినది అయినచో, పరిపూర్ణము ఆనందదాయకము కానేరదు. కనుక అట్టి అనుభవముకూడా భగవంతునకు సంబంధించినది. అయితేనే పరిపూర్ణము, ఆనందదాయకము అగును. అట్టి భగవదనుభవము భక్తి యోగమువలన సమకూడును. మరియు 3వ మనఃప్రవృత్తి అయిన తెలిసికొనుట అనునది కూడా ప్రపంచ విషయము లకు సంబంధించినది అయినచో, పరిపూర్ణము ఆనందదాయకము కానేరదు. కనుక అట్టి తెలుసుకొనుట భగవత్పరమైనచో భగవత్‌ జ్ఞానములోనికి పర్యవసానమై సఫలత నొందును. ఇదియే జ్ఞానయోగము. ఇట్లు ప్రతిమానవునికి సంబంధించిన ఈ మూడు మనః ప్రవృత్తులు భగవంతునికి సంబంధించిన కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అను 3 యోగములలోనికి పర్యవసానమైతేనే, మానవుడు సంస్కృతుడై, పరిపూర్ణుడై మోక్షము పొందును. ప్రతిమానవుడు మోక్షమును అపేక్షించును గనుక యీ 3 యోగములను అవలంబించి తీరవలయును.

ఈ 3 యోగములలో మొదటిది అయిన కర్మయోగమువలన మానవుడు తన విద్యుక్త ధర్మములను నిష్కామముగా అనగా ఫలాపేక్ష లేకుండా నెరవేర్చినచో, చిత్తమాలిన్యముపోయి; చిత్తశుద్ధికలవాడు అగును, అంతట భక్తియోగమును, దానికి సంబంధించిన యోగాభ్యాసమును చేసినచో చిత్తమునకు ఉన్న చాంచల్యముపోయి, ఏకాగ్రత కుదిరి భగవదనుగ్రహము కలుగును. ఆ తరువాత జ్ఞానయోగమువల్ల భగవంతుడే తాను అను ఐక్యభావము, సర్వాత్మభావము గలిగి మోక్షము పొందును. దీనినిబట్టి ఆత్మజ్ఞానమువలననే మోక్షమనియు. అట్టి జ్ఞానమునకు నిష్కామకర్మము భక్తిసాధనములనియు స్పష్టమగుచున్నది. అందుకనే గీతలోని మొదటి 6 అధ్యాయములు కర్మషట్కము అనియు. 7 నుంచి 12 అధ్యాయమువరకు భక్తిషట్కము అనియు, 13 నుంచి 18 అధ్యాయమువరకు జ్ఞానషట్క మనియు విభాగము కలదు. ఈ విభాగము ననుసరించిగూడా మోక్షసాధనములలో మొదటిది నిష్కామ కర్మయోగమనియు, 2 వది భక్తియోగమనియు, 3 వది జ్ఞానయోగమనియు, జ్ఞానమువలననే మోక్షమనియు తేలుచున్నది.

ఇంకను గీతలోని 18 అధ్యాయములలో మొదటిఆరు జీవత త్త్వమును గురించియు, రెండవ షట్కము ఈశ్వరతత్త్వమును గురించియు, 3 వ షట్కము జీవేశ్వరుల సంబంధము గురించియు బోధ చేయును, భగవద్గీతను యీ రెండు విధములుగా 3 షట్కములుగా విభజించుటవలన తేలినసారము ఏమనగా, జీవుడు మొదటి షట్కములో చెప్పబడిన నిష్కామ కర్మచేసినచో, సంస్కృతుడైన జీవుడగును. అట్టి జీవుడు 2 వ షట్కములో చెప్పబడిన భక్తి యోగమును అనుష్ఠించినచో చిత్త ఏకాగ్రతకల్గి భగవదనుగ్రహమునకు పాత్రుడు అగును.

ఆ పైని అట్టి జీవుడు 3 వ షట్కములో చెప్పబడిన జ్ఞానయోగమును అవలంబించి జీవేశ్వరుల సంబంధము అభేదమే అని గ్రహించి సర్వాత్మభావముతో మోక్షము పొందును. ఈ విధముగా భగవద్గీతలో మానవుడు తరించుటకు సాధనములు అన్నియు క్రమముగా బోధింపబడినవి. ఈ సాధనములను ప్రపంచములో మానవులు అందరు అభ్యసించి తరింపవచ్చును. మిగతా మత గ్రంథములు అగుబైబిలు, ఖురాన్‌ లలో గాని, సంస్కృత వాఙ్మయములోని యితర గీతలలోగాని, యీ విధములగు సాధనములన్నియు యిట్లు క్రమపద్ధతిలో బోధింపబడి యుండలేదు. బైబిలులో భక్తి ప్రధానముగను యిస్లాం మతములో ప్రపత్తి ప్రధానముగను మాత్రమే వర్ణింపబడినవి. అంతేగాని నిష్కామ కర్మయోగము భక్తి, ప్రపత్తి, జ్ఞానము, యీసాధనము లన్నియు యిట్లు క్రమపద్ధతిలో భగవద్గీతలో తప్ప ఏ యితర గ్రంథములలోను చెప్పబడలేదు. ఇతర మతములవారున్ను ఆయా మత గ్రంథముల బోధల ననుసరించినచో ఉత్తమ గతిని పొందుదురు. కాని మోక్ష మనునది పునరావృత్తి రహిత సర్వాత్మభావము కనుకను, అట్టిది జీవించి ఉండగా కలుగవలెను కనుకను. అట్టిది ఒక్క గీతాబోధవల్లనే కలుగును. గీతలో జీవన్ముక్తి అనగా జీవించి యుండగానే ముక్తి చెప్పబడినది. ఇతర మతములలో చనిపోయిన తరువాతనే ముక్తి గాని జీవన్ముక్తి లేదు. జీవించి ఉండగానే సచ్చిదానంద స్వరూపముతో సర్వాత్మభావ రూపమోక్షము. పొందుట పరమోత్కృష్టముగదా! అట్టి మోక్షము హిందూమతమునకు మతగ్రంథము అయిన వేదసారమైన యీ భగవద్గీతలోనే బోధింపబడినది. ఇందువల్ల ప్రపంచములోని మానవులు అందరు ఉత్కృష్టరూపమైన మోక్షమును పొందుటకు భగవద్గీతయే ఆధారము. కనుక ప్రపంచము అంతకు మతగ్రంథము భగవద్గీతయే అని స్పష్టమగుచున్నది. ఇదియే భగవద్గీతయొక్క విశిష్టత.

------

Geetha Koumudi-1    Chapters